Hot Posts

6/recent/ticker-posts

సీనియర్ల సేవలు పార్టీకే - జగన్‌ యోచన


విజయవాడ, జూలై 27, (ఉదయ కిరణాలు) :  ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండగా ఇప్పటి నుండే రాజకీయ పార్టీలు అందుకు సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ   తమ పార్టీలో ఏం జరుగుతున్నది? రానున్న ఎన్నికలలో గెలవాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? గెలుపు గుర్రాలు ఎవరు? తమ పార్టీకి నష్టం తెచ్చిపెట్టే ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై ఫోకస్‌ పెట్టింది.ఇప్పటికే ఎన్నోసార్లు ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు, నియోజకవర్గాలలో పరిస్థితిపై సర్వేలు తెప్పించుకున్న సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. ఆ నివేదికల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందన్న క్లారిటీ పార్టీ నేతలకు, శ్రేణులకు ఇచ్చేశారు. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేది లేదని కూడా కుండబద్దలు కొట్టేశారు. ఎమ్మెల్యేలతో పాటు మరోవైపు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఎంపీ టికెట్ల విషయంపై కూడా ఫోకస్‌ పెట్టారు. గత ఎన్నికల్లో వైసీపీ  22 మంది ఎంపీలు విజయం  సాధించగా, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రెబల్‌ గా మారారు. ఇక వైసీపీకి ఇప్పుడున్న 21 మందిలో నలుగురు ఎంపీలు వచ్చే ఎన్నికల్లో తాము ఎంపీగా పోటీ చేయలేమని, అసెంబ్లీకి వెళ్లాలని అనుకుంటున్నట్లుగా అధిష్టానానికి తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. వారిలో అనకాపల్లి ఎంపీ బీశెట్టి సత్యవతి, అరకు ఎంపీ గొట్టేటి మాధవి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, కాకినాడ ఎంపీ వంగా గీత ఉన్నారు. దీనికి వైసీపీ నుండి ఎలాంటి స్పందనా రాకపోవడంతో  వారు చాలా కాలంగా ఈ నలుగురు పార్టీకి కూడా దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నాలుగు స్థానాలలో వైసీపీ కొత్త వారి  కోసం వేట మొదలు పెట్టింది.


మరో నలుగురు ఎంపీలను   ఈసారి అసెంబ్లీకి పంపాలని  జగన్‌ స్వయంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. అలాంటి వారిలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. మొత్తంగా ఈ ఎనిమిది పార్లమెంట్‌ స్థానాలకు వైసీపీ కొత్త అభ్యర్థులను దించాల్సి ఉండగా.. మరో ముగ్గురు ఎంపీలు వారి మూడు స్థానాలలో ఓటమి చూడడం ఖరారని నివేదికలు రావడంతో వారిని కూడా మార్చాలని జగన్‌ భావిస్తున్నారు.  అంటే మొత్తంగా 21 మందిలో పది మంది పాత వారికి మాత్రమే ఎంపీ టికెట్లు ఇవ్వనుండగా 11 మంది   స్థానాలలో కొత్త వారిని దించనున్నారు. కాగా, ఈసారి వైసీపీ సీనియర్‌ నేతలను పార్లమెంట్‌ కు బరిలో దింపాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. 


ఉత్తరాంధ్రాలో విజయనగరం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, అనకాపల్లి లేదా విశాఖ నుంచి అవంతి శ్రీనివాసరావు, కాకినాడ లోక్‌ సభ స్థానం నుంచి కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఏలూరు నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, నెల్లూరు నుంచి  మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ లను లోక్‌ సభ కు పంపాలని జగన్‌ భావిస్తున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.ఇప్పటికే ఆయా నాయకులకు  పార్టీ నుండి ఆదేశాలు కూడా వెళ్లాయంటున్నారు.  కాగా, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డిని నెల్లూరు రూరల్‌ నుంచి, హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్‌ ని కర్నూల్‌ జిల్లాలో ఆయన సామాజికవర్గం అధికంగా ఉన్న సీటు నుంచి ఎమ్మెల్యేగా, విజయనగరం జిల్లా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ ని ఎచ్చర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేయించేందుకు కసరత్తులు మొదలు పెట్టగా.. ఈసారి ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లాలని ఆలోచన చేస్తున్న మిగతా ఎంపీల అసంతృప్తిని ఎలా చల్లార్చాలా అని మల్లగుల్లాలు పడుతున్నారంటున్నారు. జగన్‌ నిర్ణయం రుచించని వారు రెబల్స్‌ గా మారుతారన్న ఆందోళన కూడా పార్టీలో వ్యక్తమౌతోందంటున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు