ఫిబ్రవరి 11న నోటిఫికేషన్ - ప్రకటన విడుదల చేసిన ఈసీ
హైదరాబాద్,జనవరి22(ఉదయ కిరణాలు): జీహెచ్ఎంసీ నూతన మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 11న నూతన మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు. ఈ మేరకు శుక్రవారం జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను నిర్వహించనున్నారు. కాగా ఈ ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ఈనెల 10వ తేదీతో ముగిసింది. ఇప్పటికే కొత్తగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్ల పేర్లను నమోదు ఈసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా డిసెంబర్లో జరిగిన గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ 55 సీట్లకే పరిమితమైంది. 2016 ఎన్నికల్లో 99 చోట్ల నెగ్గి ఏకపక్షంగా గ్రేటర్ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్న గులాబీ పార్టీకి ఈసారి ఏకంగా 44 స్థానాలు తగ్గాయి. దుబ్బాక విజయంతో గ్రేటర్లో దూకుడు ప్రదర్శించిన బీజేపీ అంచనాకు మించి 48 డివిజన్లలో విజయం సాధించింది. కాగా మజ్లిస్ మరోసారి తన బలాన్ని చాటుతూ 44 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.
0 కామెంట్లు