న్యూఢిల్లీ,జనవరి25(ఉదయ కిరణాలు): దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా సోకింది. ఢిల్లీ జనాభా సుమారు రెండు కోట్లు కాగా అందులో సగం అంటే కోటి మంది కరోనా బారినపడి కోలుకున్నారని ఇటీవల నిర్వహించిన ఐదవ సెరోలాజికల్ సర్వేలో వెల్లడైంది. దేశ రాజధాని ప్రాంతంలో కరోనా వ్యాప్తి గురించి తెలుసుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు సెరోసర్వే నిర్వహించింది. తాజాగా ఈ నెల 10 నుంచి 23 వరకు భారీ స్థాయిలో చేపట్టిన ఐదో విడత సెరోసర్వేలో పలు ఆసక్తికర అంశాలు తెలిశాయి. ప్రతి మున్సిపల్ వార్డు నుంచి వంద చొప్పున మొత్తం 28 వేల మంది నుంచి నమూనాలు సేకరించారు. గత నాలుగు సెరోసర్వేల్లో 23 నుంచి 25 శాతం మందిలోనే యాంటీబాడీను గుర్తించగా ఐదో విడత సర్వేలో 60 శాతం మందిలో కరోనాను తట్టుకునే రోగనిరోధకాలను గుర్తించారు. సుమారు 60 శాతం మంది ఢిల్లీ ప్రజల్లో కరోనాను తట్టుకునే ప్రతిరోధకాలు ఉన్నట్లు యాంటీబాడీ పరీక్షల్లో గుర్తించారు. అంటే దేశ రాజధానిలోని సుమారు సగం మంది ప్రజలు వారికి తెలియకుండానే కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నారు. దీంతో ఢిల్లీలోని సగం జనాభా కరోనాను తట్టుకునే రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నదని, వారంతా హెర్డ్ ఇమ్యూనిటీ దశకు చేరుకున్నారని ఈ సెరోసర్వే ద్వారా వెల్లడైంది.
0 కామెంట్‌లు