ఏలూరులో పెరుగుతున్న బాధితుల సంఖ్య
ఏలూరు,జనవరి21(ఉదయకిరణాలు): పశ్చిమ గోదావరి జిల్లాలో పూళ్లలో వింత వ్యాధితో ఒకరు చనిపోయారు. ఇటీవల వింత వ్యాధితో పంట పొలాల్లో పడిపోయిన బుల్లబ్బాయి అనే వ్యక్తి చనిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయాడు. అతడు గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు చెప్పారు. ఇటీవల పొలంలో పనిచేస్తున్న రైతు బుల్లబ్బాయ్ ఉన్నట్టుండి పొలంలోనే పడిపోయాడు. దీంతో అతడిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఈ రోజు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.45 రోజుల క్రితం ఏలూరులో వందలాది మందిని ఆస్పత్రి పాలు చేసిన వింత వ్యాధి ఇప్పుడు జిల్లాలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపిస్తోంది. తాజాగా భీమడోలు మండం, పూళ్ల, పరిసర గ్రామాల ప్రజలను వణికిస్తోంది. క్రమంగా బాధితుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం 31 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా మరో ఐదుగురు ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో 22 మంది పరిస్థితి మెరుగు పడటంతో డిశ్చార్జ్ చేశారు. మిగిలిన వారు పూళ్ల ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఇద్దరికి మూర్ఛరావడంతో నురగలు కక్కి పడిపోయారు. వీరిలో ఒకరికి తలకు గాయం కూడా అవడంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగిలిన వారు ఇంకా తలనొప్పి, కాళ్లనొప్పులతో బాధపడుతున్నారు. డిశ్చార్జ్ అయిన వారిలో ఇద్దరు వ్యక్తులు మూడుసార్లు మూర్చవచ్చి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో కూడా వింత వ్యాధి ఏలూరు వాసులను తీవ్రంగా భయపెట్టింది. అప్పట్లో పలు సంస్థలు అక్కడ టెస్టులు చేశాయి. ఆ సంస్థ ప్రాథమిక రిపోర్ట్స్ ప్రకారం వ్యవసాయానికి భారీగా పురుగుల మందు వాడటమే కారణమని పేర్కొన్నాయి. వింత వ్యాధి బారిన పడిన బాధితుల రక్తంలో సీసం, నికెల్ ఉన్నట్టుగా ఎయిమ్స్ తెలిపింది. మరికొన్ని సంస్థలు మాత్రం బాధితులు తీసుకున్న ఆహారంలో పురుగుల మందు వంటి రసాయనా అవశేషాలు ఉన్నట్టుగా ప్రాథమిక పరిశోధన ఫలితాల్లో వెల్లడించాయి. ఈ ఫలితాలను స్థానికులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆహారంలో రసాయనాలు ఉండటం భవిష్యత్తులో తమపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని జనం భయపడిపోతున్నారు.
0 కామెంట్‌లు