Hot Posts

6/recent/ticker-posts

విష కాలుష్య రహిత కంపెనీలు మనకు అవసరమా ?

విష  కాలుష్య రహిత కంపెనీలు మనకు  అవసరమా ?
ఆధునిక హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉందాం.
కాలుష్య లేని భారతాన్ని నిర్మించుకుందాం 
ఉదయ కిరణాలు  మే 8 :
విశాఖపట్నం సవిూపంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ నుండి విడుదలైన స్టైరీన్‌ విష వాయువు ఘటన మరోమారు మనకు గుణపాఠం కావాలి. కాలుష్య కారక పరిశ్రమలతో ప్రాణహాని తప్ప ప్రయోజనం లేదని గుర్తించాలి. లాక్‌డౌన్‌ కారణంగా ఎన్నో కొత్త పాఠాలు  నేర్చుకుంటున్న మనం పర్యావరణ హితం కోరే విధంగా ముందుకు సాగాల్సి ఉంది. ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ ఉత్పత్తి చేసే వస్తువులు  వాడకుంటే కొంపలేం అంటుకోవు. కరోనా లాక్‌డౌన్‌తో గత జీవితానికి... ఈ  రెండు నెలల  జీవితానికి ఎంతో తేడా వుంది. ఏది లేకున్నా బతకగలమన్న అనుభవ పాఠం ప్రతి ఒక్కరి సొంతం అయ్యింది. మద్యం లేకున్నా ఉండగలమని నిరూపించాం. అయితే ప్రభుత్వాలు  మళ్లీ మద్యం దుకాణాలు  తెరవగానే ఎగిరి గంతేసి క్యూ కట్టాం. ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్‌ వంటి సంస్థ సంగతి కూడా అంతే. కరోనా కష్టాలతో ఇప్పటికే  బిక్కుచచ్చి బతుకుతున్న ప్రజలపై  విషవాయువుల  ప్రభావం తీవ్రంగా ఉండబోతున్నది. చనిపోయిన వారు చనిపోగా బతికున్న వారు తీవ్ర నరకం అనుభవించే అవకాశం లేకపోలేదు. కరోనాను మించిన ప్రభావం గ్యాస్‌ లీక్‌ ద్వారా అనుభవంలోకి రానుంది. ఇలాంటి పరిశ్రమల  వల్ల ఇప్పుడూ..ఎప్పుడూ ముప్పే. పర్యావరణానికి కూడా ముప్పే. పచ్చని పంటపొలాలు , మన పాడి పశువులు  కూడా దెబ్బతిన్నాయి.గ్యాస్‌ ఘాటుకు ప్రజలంతా తల్లడిల్లుతారు. కరోనా వచ్చి చచ్చిపోయినా ఇంతటి ఘోరం ఉండేది కాదు. విశాఖ ఘటన మనకు గుణపాఠం కావాలి. ప్రజలు  ఇలాంటి పరిశ్రమల  వల్ల ఉపాధి పొందడం కంటే మొత్తం జీవితాలనే కోల్పోవాల్సి వస్తుందని గుర్తించాలి.

భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన తాలూకు దుష్పభ్రావాలు  ఇంకా వీడడం లేదు. అలాగే ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ వల్ల కలిగిన నష్టాలు  ఎంతకాలం  ఉంటాయో చెప్పలేం. ప్రధానంగా ఆరోగ్య సమస్యలో  తీవ్రం అవుతాయనడంలో సందేహం లేదు. పిల్లలను, వృద్ధులను మోసుకుపోతున్న వాళ్ళు, ఆ వేదన రోదన మధ్యనే తమకుటుంబీకులను కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నవారితో ఈ విషాద దృశ్యాలు  అనేకులకు కంటతడి పెట్టించాయి. ఐదు కిలోవిూటర్ల మేరకు విస్తరించిన ఆ విషం మనుషులనే కాదు, అమాయక పశుపక్ష్యాదులనూ పొట్టన బెట్టుకుంది. పచ్చని చెట్లు సైతం మాడిమసై మెడు వాల్చేసిన భయానకమైన ఘటన ఇది. ఇంతటితో ఈ నష్టం ఆగిపోతుందని భావించడానికి లేదు.
 భయానకమైన విషవాయువును దాచుకున్న కంపెనీ  బాధ్యతారాహిత్యం కారణంగా నష్టపోయింది సామాన్యులే. ఈ వాయువు మనిషిపై చూపే దీర్ఘకాలిక ప్రభావం తీవ్రమైనది. ప్రాణవాయువుతో కలిసి నందున స్టైరీన్‌ మరింత ప్రమాదకర రూపాన్ని సంతరించుకొని, కొన్ని వారాలపాటు గాలిలోనే ఉండిపోతుందన్న విశ్లేషణలు  భయపెడుతున్నాయి.

 దశాబ్దాల  తరువాత భోపాల్‌ విషవాయు ఘటనలను మరోమారు మనకు గుర్తుచేసిన ఈ ప్రమాదంలో కంపెనీ నిర్లక్ష్యం అణువణువునా కనిపిస్తున్నది. లాక్‌డౌన్‌ కారణంగా మూతబడిన కంపెనీలన్నీ తగు రక్షణచర్యలు  కొనసాగిస్తున్నదీ లేనిదీ కనిపెట్టాల్సిన అవసరం ఉంది.ఈ కాలుష్య కారక కంపెనీని మూసివేయాని ఎంతోకాలంగా ప్రజలు  డిమాండ్‌ చేస్తున్నప్పటికీ పాలకులకు పట్టలేదు. ఇప్పుడు దీనిని ఇక మూసివేయించే దిశగా ప్రయత్నాలు సాగాలి. కరోనా కారణంగా చైనా నుంచి తరలిపోతున్న కంపెనీలకు ఘనస్వాగతం పలకండి అంటూ పాలకులు  క్యూ కడుతున్నది కూడా ఇలాంటి పరిశ్రమల  కోసమే. ఇలాంటి వాటిని దేశంలోకి అనుమతిస్తే కోరి విషాన్ని కొనుక్కున్నట్లే కాగలదని గుర్తుంచు కోవాలి. అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నట్టు మనకు కనబడే ఈ ప్రపంచంలో ఎంతటి విషం నిండివుందో ప్రజలు  గమనించాలి. ఆధునికంగా మారడానికి తోడ్పడుతున్నాయని చెప్పే అనేకానేక ఉపకరణాల  ఉత్పత్తి లో ఎన్ని ప్రమాదాలు  పొంచివున్నాయో గమనించాలి.

ఆధునిక జీవితం నుంచి సాధారణ జీవితానికి అలవాటు పడితే అనేక ఉపకరణాల  అవసరం రాదు. అలాంటి కంపెనీల  కోసం వెంటర్లాడే పరిస్తితి రాదు. వేలమంది ప్రాణాలు  బలిగొని, లక్షలాది మందిని శాశ్వతంగా వ్యాధిగ్రస్తుల్ని చేసిన భోపాల్‌ దుర్ఘటన నుంచి మనం ఇంకా పాఠాలు  నేర్చుకోలేదు. లాభాపేక్ష మినహా మరేది పట్టించుకోని బహుళజాతి సంస్థ పోకడను, భద్రతా ప్రమాణాలు  పాటించడంలో వాటి నిర్లక్ష్యాన్ని వెలుగులోకి తెచ్చింది.  ఇలా పలు  దుర్ఘటనలు  జరుగుతున్నా, జననష్టం సంభవిస్తున్నా అప్రమత్తంగా వ్యవహరించడంలో పరిశ్రమలు , ప్రభుత్వాలు  దారుణంగా విఫలమవుతున్నాయి.  పౌరుల  ప్రాణాలతో ముడిపడివున్న ఇలాంటి సంఘటనలు  జరిగినప్పుడు హడావిడి చేసే పాలకులు  తరవాత ప్రజల  ప్రాణాలను పట్టించుకోరు. అనంతర పరిస్థితులను గుర్తించరు. అందువల్ల  ప్రజలే  మేల్కోవాలి. ఎల్జీ పాలిమర్స్‌ విషయంలో ప్రమాదం ఎందుకు జరిగిందీ.. కారకులు  ఎవరన్నది విచారణ సాగుతుంది.


విచారణ నివేదికలు  వస్తాయి. మళ్లీ కంపెనీ నడుస్తుంది. అయితే ఇలాగే చూస్తూ ఊరుకుందామా లేక మనకు..మనం మారుదామా అన్నది ఆలోచన చేయాలి. కాలుష్య కారక పరిశ్రమలను వ్యతిరేకించడంలో ఉద్యమించాలి. ప్రాణాలకు తెగించాలి. భవిష్యత్‌ తరాలను కాలుష్యానికి బలి చేయొద్దు. మన పర్యావరణానన్ని దెబ్బతీసే సంస్థకు అనుమతించేలా పాలకులు  చూడకుండా చేయాలి. అప్పుడే మనకు ప్రశాంత జీవనం దక్కుతుంది. లాక్‌డౌన్‌ పాఠాలతో మనమంతా భారతీయ సనాతన సంప్రదాయాలకు అవాటు పడి జీవితాలను మార్చుకుందాం. వ్యవసాయకంగా బల పడదాం. ఉన్నంతలో బతకడంతో పాటు ఆధునిక హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉందాం.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు